Friday 26 October 2012

ఈ మట్టి మనిషినే ...తెలంగాణా కవినే .....!




నేను వాన చినుకుకై తపించేటోన్ని 
నేను మట్టి వాసనకు పులకరించేటోన్ని
మట్టి పాటై  పలకరించే వాడిని 
కవిత్వపు వితై మట్టి నుండి మొలకేత్తేవాడిని
నేనో మట్టి మనిషిని 

పచ్చని నా నేల బీటలువారుతుంటే 
నా  నేలపై నా అస్తిత్వం అణగారుతుంటే 
నా నేలపై నన్ను వేరొకరు పాలిస్తుంటే 
నా మట్టిలో మోదుగు పూలను తుంచి 
కాగితపు పూలను పూయిస్తుంటే 
నా  మట్టిపాట గొంతు నులిమి
 కిరాయిపాట  గళమెత్తుతుంటే
నిజం అణిచివేయబడుతుంటే 
నిరంకుశత్వం పురివిప్పుతుంటే 
నా మట్టిలోని చరిత్రను మట్టికిందే సమాధి చేస్తుంటే 
నేను ఈ మట్టి కవినై 
నా ఈ మట్టి కోసం మహా కావ్యమవుతా 
నా ఈ మట్టి కోసం మహా పోరాటం నడుపుతా 

ఈ పోరాటం లోన
నా మస్తిష్కం నుండి దూసుకొచ్చే  ప్రతి అక్షరం
నా నేలను చేరబట్టిన వాళ్ళను చీల్చి చెండాడుతుంది 
నా నేలపై అవతలివాడి ఆధిపత్యాన్ని 
అడ్డంగా నరికేస్తుంది 
అణిచివేతలను చీలుస్తూ అగ్గి రవ్వై 
నా నేలపై నిలిచినా కాగితపు పూలను కాల్చివేస్తుంది 
అప్పుడు నా అక్షరం 
ఈ మట్టి మాటై నోరేత్తుతుంది 
ఈ మట్టి పాటై గళమెత్తుతుంది       
తనపై జరుగుతున్న దాష్టికాన్ని ప్రశ్నిస్తుంది 
ఎవడ్రా నన్ను ఎలేది 
ఎవడ్ర నా తనువును బీటలువార్చింది 
ఎవడ్రా నా ఒడిలోని జలాలు జుర్రుకుంది 
ఎవడ్రా నా ముఖ చిత్రాన్ని మార్చింది 
అంటూ మహా పోరాటానికి పూనుకుంటుంది 
మట్టి కవితై అక్షర శాపం పెడుతుంది 
మట్టి లోనుంచి మొలకెత్తిన ఎర్ర గులాబై పోరు దారులేస్తుంది 

నా నేల తనను తను ఆక్రమిన్చుకు నే0తవరకు
నామత్తిలో గోగుపూలు గుభాలిన్చెంతవరకు 
నా మట్టిలో తంగెళ్ళు తాండవమాడెంతవరకు   
నా నేల ముఖ చిత్రం పై కప్పిన ముసుగు తోలగెంతవరకు       
అక్షరాలను ఆయుధాలుగా చేసి '
కవిత్వాన్ని పోరాటంగా మలచి 
నా  ఈ మట్టి కోసం ఈ మట్టి కవినై 
హద్దులు లేని కవిత్వానికి 
హద్దులు గీసుకొని 
తెలంగాణ కవిత్వం లిఖిస్తాను 
అక్షర పోరాటం సాగిస్తాను 

ఈ పోరాటంలో 
చచ్చినా బ్రతికినా 
ఓడినా గెలిచినా
తెలంగాణా వచ్చేంతవరకు 
నేనెప్పుడు
ఈ మట్టి మనిషినే 
తెలంగాణా కవినే 

జై తెలంగాణ    జై జై తెలంగాణ 

                          రచన 
                   సతీష్ కుమార్ బొట్ల 
                        బొట్లవనపర్తి 
                         కరీంనగర్ 
                       9985960614
           botla1987.mygoal@gmail.com
                     www.jaitelangna.com

No comments:

Post a Comment