Saturday 3 June 2023

నమ్మక ద్రోహం

వంచనకు, మంచితనానికి

మనిషి ఒక్కడే

ముఖం పై ముసుగేసుకున్నప్పుడు

వంచన కూడా మనచిగానే కనిపిస్తుంది

తన నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ

తేనే మాటల తూటాలు విసిరినప్పుడు

మోసపోవటం సహజమే అవుతుంది

మోసం నిత్యకృత్యమే అవుతుంది

 

ఆధునిక ప్రపంచంలో

నమ్మించి మోసం చేయాటమైన

నమ్మి మోసపోవటమైన

కారణం ఒక్కటే

మనిషి మిద మనిషికి

ఉన్న ఆహం ఒక్కటే

ఎదుటి వాడిని తొక్కి

ఎదుగాలనే నైజం ఒక్కటే

 

 

ముసుగు వెనుకాల మరో ముఖం

అసహజమైన అదే నిజం

మనిషిలోకి మనిషి అంతర్ముఖ ప్రయాణమే

ముసుగు వెనుక అసలు మొహం బహాటమే

రాజకీయ తంత్రం వెనుకాల కుతంత్రాలు

సంక్షేమ జపం వెనకాల క్షౌరాలు

ఉద్యోగ ఆశల వెనకాల ఆగాని మోసాలు

అన్ని అంతర్గత అనుభందాలే

నయ జమానా లో

నీ నమ్మకమే ఎదుటివాడి

మోసానికి పునాది

ఎదుటివాడిని నమ్మటమే

నీకు నువ్వు కట్టుకునే సమాధి.

                                

                                      రచన

                           సతీష్ కుమార్ బొట్ల

               కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం.

                                9985960614

                         Botlasjindaji.blogspot.in

 

Saturday 15 May 2021

ఏమో ? / చివరి నిమిషం వరకు

 

కాలం పేల్చిన ఫిరంగులకి

కలల సౌధం కూలిపోతుంటే

కనుపాప చూసిన రేపటి స్వప్నం

కనురెప్పల మాటు కన్నీటిలోనే కరిగిపోతుంటే

నిర్లిప్తం చేసిన నిర్దాక్ష్యపు దాడికి

నిన్నటి చిరునవ్వులు చితికిపోతుంటే

కలగన్న ప్రయాణంలో

కనిపించని మలుపులెన్నో

నిత్యం నడవాల్సిన దారిలో

నిన్ను పడదోసే కుదుపులెన్నో

నిశి పరుచుకున్న జీవితంలో

శశి కూడా వెలిగించలేని కాళరాత్రులెన్నో

 

ఏమో ఏ ప్రయాణం

ఎప్పుడు ముగుస్తుందో

ఏమో ఏ మలుపు

గెలుపు తలుపు తడుతుందో

ఏ మిణుగురు

చీకటిని వెలిగిస్తుందో

ఏ రవి కిరణం

రాతిరిని కరిగిస్తుందో

ఏ ఓటమి

ఎప్పుడు అస్తమిస్తుందో

ఏ గెలుపు

ఎప్పుడు ఉదయిస్తుందో

 

ప్రాణం  నిలిచిన చివరి నిమిషం వరకు

పాదాల ప్రయాణం సాగాల్సిందే

నయనం వెలుగును చూసేవరకు

నిరంతరం కనురెప్పలు తెరిచి ఉంచాల్సిందే..

నిన్ను నువ్వు జయించేంతవరకు

నిత్యం జీవితం తో పోరాటం చేయాల్సిందే.

 

                                      రచన

                        సతీష్ కుమార్ బొట్ల

           కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం.

                                9985960614

                                           Botlasjindaji.blogspot.in


Friday 5 March 2021

"మోదుగుపూల వనం"

 

గడీల పాలనలో

గడియ బ్రతకు గగనమైనప్పుడు

బలసిన దొరల పెత్తనంలో

బక్కోడి బ్రతుకు ఛిద్రమైనప్పుడు

పాలేగాళ్ల పంచన

పాలేరుగిరే శరణమైనప్పుడు

అణచివేతలు అధికమైనప్పుడు

అడుగడుగునా అవమానాలు ఎదురైనప్పుడు

అణచివేయబడ్డ జీవితాలు

కార్చిన కన్నీళ్లకు పూసిన మోదుగుపూలు

బలహీనుడి భుజాన

బలమైన వేలాడిన బందూకలు.

జనరాణ్యం లోని మృగాలను తరిమేందుకు

వనరాణ్యంలో శక్తిని నింపుకున్న విప్లవ కేకలు.

 

 

బురుజు కోట గోడలు

బద్ధలుకొట్టిన డైనమేట్ మోత

భూస్వామ్య వ్యవస్థ గుండెల్లో

గుబులు పుట్టించిన

లాల్ సలాం కూత.

ప్రజాస్వామ్యంలో న్యాయం

పాలకుల పంచన చేరినప్పుడు

ప్రజా దర్బార్లో న్యాయాన్ని

ప్రజల చెంతకు చేర్చిన చీకటి సైన్యం.

అంతర్గత పోరులో మునిగినప్పుడు

ఆత్మశుద్ధి లేని బలగాలపై

సుధీర్ఘ శిశిరం చేసిన దాడికి

ఆశయాలు రాల్చి మోడువారిన వనమైంది.

 

 

రూపం మార్చిన సమస్యను చేరబట్టేందుకు

రాజకీయ ముసుగులో

రక్తపాతాన్ని రూపుమాపేందుకు

దౌర్జన్యం దవానలమై వ్యాపించినప్పుడు

దగాపడ్డ బతుకుల ఆశలు రాలిపడినప్పుడు

పచ్చని అడవిలో మళ్ళీపూసే

ఎర్రని మోదుగుపూల వనం

సామ్రాజ్యవాద దొర పాలనపై

పేలనున్న విప్లవ కణం.

 

  రచన

                                సతీష్ కుమార్ బొట్ల

                 కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం.

                               Cell: 9985960614.

                                       Botlasjindagi.blogspot.in   

Monday 12 October 2020

తడబడి..తలపడుతూ...


కనులను కటిక చీకటి కమ్మేసినప్పుడు

మనసంతా శూన్యం విస్తరించినప్పుడు

నాలో నేను తడబడ్డాను

నాతో నేను తలపడ్డాను

దరి చేరేందుకు అల

తీరంతో తలపడ్డట్టు

ధరణికి వెలుగునిచ్చేoదుకు చుక్కలు

తిమిరంతో తలపడ్డట్టు

 

 

అధఃపాతాళానికి తొక్కిపెట్టిన

ఆగిపోని ఆలోచనల ఉప్పెనను

అదిమి పెట్టేందుకు

బొక్కెనేసి తోడిన ఇంకిపోని

కన్నీటి బావిని పూడ్చేందుకు

బోధనెంత చేసిన మారని

మనస్సును మార్చేందుకు

బయటనుంచి నాలోకి

నాలోంచి బయటకి

నిరంతరం పరిభ్రమణం చెందేందుకు

గెలుపు నుంచి ఓటమికి

ఓటమి నుంచి గెలుపుకి

నిత్యం పయనించేందుకు

ముళ్లున్న దారుల్లో తడబడుతున్న

మూడు పదుల వయస్సుతో తలపడుతున్న

 

 

ఆకులు రాల్చిన చెట్టెప్పుడు

మోడుగా మిగిలిపోదు

మాటలు వదిలిన మనసెప్పుడు

మౌనంగానే ఉండిపోదు

నింగిని వదిలిన చినుకు

నేల వైపు సాగినట్లు

బాధలను వదిలిన మనిషి

బాధ్యతలవైపు నడిచినట్లు

నిన్నటి పాదాలపై నేటిదారుల్లో

నేను రేపటివైపుకు నడుస్తున్నాను

నేనెప్పుడు ఫలితాన్ని ఆశించని

నిత్య పోరాటమే చేస్తున్నాను.

       

 

             రచన

      సతీష్ కుమార్ బొట్ల

కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం

        9985960614

  Botlasjindagi.blogspot.in

జీవన మజిలీ


 

మాటలు గుండెల్లో

పూడుకుపోయినప్పుడు

మౌనం మనస్సుతో

మాటలాడినప్పుడు

ప్రపంచానికి తెలియని

పలవరింతలెన్నో

కనులువీడి కదలని

కలత నిద్రలెన్నో

 

 

వెలుతురు అస్తమించిన ప్రయాణంలో

వెలిగించిన కాగడాను చీకటి మింగేసినట్లు

సముద్రంనుడి పైకెగిసిన అలను

అదే సముద్రం లాగేసుకున్నట్లు

కనే కలల్ని కన్నీళ్లే తుడ్చేస్తుంటే

కదిలే పాదాల్ని

కాలమే కట్టిపడేస్తుం(ది)టే

గతమంత గారుడుకట్టిన గాయమై

భవిష్యత్తు బహుళ ప్రశ్నార్ధకమై

గుండెను సలుపుతున్న గాయాలను

గమనమంత గతుకుల మాయమైన దారులను

దాటుతూ సాగుతున్న ప్రయాణంలో

దారంత పరుచుకున్న ముల్లెన్నో

వాటిని ఏరేలోపే

ముగింపులేని

మూల మలుపులెన్నో

వాటిని దాటేలోపే

అడుగు కదపనివ్వని

అవరోధాలెన్నో

 

 

ఏ మలుపు నన్నుఎటువైపు తిప్పిన

ఏ ఓటమి నన్ను వెంటాడిన

ఏ గెలుపు నన్ను ఊరించిన

గెలుపు ఓటములు లేని

గమ్యన్నీ చేరెవరకు

మొదలు ముగింపు లేని

గమనాన్ని తాకే వరకు

చీకటి వెలుగులను దాటుకుంటూ ....

కలలను కన్నీళ్ళని ఈదుకుంటూ

సాగిపోతూనే ఉంటుంది

నా జీవన మజిలీ.

 

     

      రచన

సతీష్ కుమార్ బొట్ల

9985960614

Botlasjindagi.blogspot.in