Wednesday 27 April 2016

ఒంటరితనం

గుండెల్లో గూడుకట్టుకున్న దు:ఖం
కళ్ళల్లో సుడులు తీరుగుతుంటే
మసక బారిన దారుల్లో
మనసు గతితప్పిన ప్రయాణంలో
తీరం చేరేవరకు ఒంటరితనమే
తిమిరం తాకేవరకు ఓదార్పులేని దేహమే

అడుగులు కదిపిననాడు
ఆశల రెక్కలు అంబరాన్ని తాకిననాడు
వాన చినుకు నేలను ముద్దాడిననాడు
వసంతాలు విరబూసినప్పుడు
ప్రకృతి  వికశించినప్పుడు
ప్రాణం పరవశించినప్పుడు
లేని ఒంటరితనం
నేడెందుకో మొగ్గ తొడిగింది

ఋతువులు మారినాక
మేఘాలు మౌనం వహించినాక
ఆశల చినుకెక్కడినుండి కురుస్తుంది
ఒంటరితన౦ తప్ప
ఆర్తిగా చూసే నేలెక్కడి నుండి తడుస్తుంది
ఓదార్పులేని కన్నీళ్ళతో తప్ప
ప్రాణం పోయాలనే ఆశ చచ్చిపోయక
పగుళ్ళు పరిన నేలైన
జీవించాలనే ఆశ చచ్చిపోయాక
జీవకళ లేని జీవితమైన ఒక్కటే  
ఆత్మీయులు దూరమయ్యాక
అనుబంధాలు భారమయ్యాక
గుండెలపై దిగులు కూర్చున్నాక
గుళ్ళోని దేవుడైన
గుట్టల్లోని రాల్లైన ఒక్కటే
పల్లకి మోయటమైన
పాడే ఎత్తటమైన ఒక్కటే

నిన్నటి వసంతం పై
నేటి శిశిరం దాడి చేసాక
ఏండ్ల నుండి నడిసోచ్చిన తొవ్వ
ఎండిపోయి  ప్రాణకళ తప్పినాక
ఎటేల్లాలో తెలియని సందిగ్ధతలో చేసేదేముంది
ఎంత ఒంటరి తనమైన ఎల్లబోయటం తప్ప

నిలువెల్లా ఒంటరితనం పరుచుకున్నాక
నిల్చున్న కూర్చున్న
నిద్రొయిన, మేలుకవలో ఉన్న
సమూహంలో ఉన్న
సాహిత్యంలో ఉన్న
ఓదార్పు పొందేవరకు
ఓదార్పును ఇచ్చేవారు వచ్చేంతవరకు
ఒంటరితనమే
ఐన సమూహంలో ఒంటరవ్వటం కంటే
ఒంటరితనంలో సముహమవ్వటమే నయం
ప్రాణం పోసే అమ్మ కడుపు సాక్షిగా
ప్రాణం పోయాక చేర్చే స్మశానం సాక్షిగా
ఒంటరితనమే మొదలు తుదలు.

                                          ..........సతీష్ కుమార్ బోట్ల

                                                                  9985960614