Monday 27 April 2020

అక్షర చరిత్రను / నేనెప్పటికీ


నేనిప్పుడు
అలల్ని అదిమి
కలల్ని పొదిమి
కవిత్వాక్షరాలై అమరినవాన్ని

నేనిప్పుడు
కోట గోడలపై
ఏటి తడల పై
గడ్డిపువ్వై పూచినవాన్ని

నేనిప్పుడు
కారుమబ్బుల శూన్యంలో
కికరారణ్యంలో
వెలుగు కిరణమై మెరిసినవాన్ని

నేనిప్పుడు
నేర్రలు వారిన బీళ్ళపై
నానాటికి అడుగంటిపోతున్న నీళ్ళపై
కన్నీటి బిందువై కురిసినవాన్ని

నేనిప్పుడు
కాలం తప్పినా కార్తేపై
ఖాళీఅవుతున్న ఊళ్ళపై
కలత చెందుతున్నవాన్ని

నేనిప్పుడు
బారికేడ్ల పై
బాష్పవాయు గోళలపై
నెత్తుటి చారికలై మిగిలినవాన్ని

నేనిప్పుడు
అమరుల త్యాగాలపై
ఆత్మగౌరవ పోరాటాలపై
ఆర్తిగా రాలిన పూలవానని

నేనిప్పుడు
పరాయి పాలనపై
పక్షపాత వైకరిపై
ఫిరంగై పేలినవాన్ని

నేనిప్పుడు
నిరంకుశత్వపు ప్రభుత్వం పై
నిర్లక్ష్యపు నాయకత్వం పై
నినదించిన ప్రజా గొంతుకని


నేనిప్పుడు
మతోన్మాద ముర్ఖులపై
సామాజిక బాధ్యత మరచిన సంస్కార హీనులపై
సమరశంఖరావమై మ్రోగినవాన్ని

నేనిప్పుడు
వలస బతుకుల వెతలను
వాలిన పొద్దుపొడుపు కథలను
వర్ణచిత్రంగా మలిచే కుంచెను 


 నేనిప్పుడు
  మరణ మృదంగం మోగిస్తున్న మహమ్మారిపై
  మానవత్వం మరిచిన సమాజం పై
  మ్రోగిన యుద్దబేరిని


అప్పటికి , ఇప్పటికి
నేనెప్పుటికి
పదమై పలవరించి  
కలమై కలవరించి
కవిత్వమై కదిలిపోయేవాన్ని
అక్షర చరిత్రనై నిలిచిపోయేవాన్ని.



                        రచన
                 సతీష్ కుమార్ బొట్ల
                    బొట్లవనపర్తి
                 9985960614
            

Monday 20 April 2020

ఎందుకు రాయాలి?



రాయాలా!
ఏం రాయాలి ?
ఎందుకోసం రాయాలి ?
రాసింది చదివే ఓపికలేని
బద్దకస్తుల కోసమా?
చదివింది అర్థం చేసుకోలేని
ఆజ్ఞానుల కోసమా ?
రాయటాన్నీ చదవటాన్నీ 
ఎగతాళి చేసే మూర్ఖులకోసమా ?
విషయ జ్ఞానం లేకున్నా
వితండవాదం చేసే వింత మనుషులకోసమా ?
ఎందుకోసం రాయాలి ?



అక్షరాలు ఆయుధాల కంటే పదునైనవని
ఆయుధాలు గెలవాలేని చోట కూడా 
అక్షరాలు గెలిసి నిలుస్తాయని
అక్షరాలు ఆలోచనలకు
పదును పెడుతాయని
అక్షరాలు ఆశయం వైపు నడిపిస్తాయని
చేతులు రాసే రాతలు 
తల రాతలను మారుస్తాయని
పెన్ను పాళీనుండి రాలే అక్షరాలు
ప్రపంచ స్థితి గతులనే
తారుమారు చేస్తాయని
అక్షరాలు రాయటమంటే
ఆలూ చీప్స్ తిన్నంత  సులభం కాదని
అంతర్మధనం జరగాలని
అంతః కరణ శుద్ధిఉండాలని
తెలుసుకోలేని తెలివితక్కువ
జనాలకోసం రాయాలా?


రాతలమీద కూడా
రాజకీయాలు చేసే రచయితలు
అవతలివాడి అక్షరాలను కూడా
అవార్డుల కోసం అమ్ముకునే 
అబద్ధపు కవులు
కాసేపు స్వడబ్బా
కాసేపు పర డబ్బాతో
పరస్పర సహకారంతో
సాహిత్యం లో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న
కొద్దిమంది చేతుల్లో  సాహిత్యాన్ని బందీ చేయటానికా
ఎందుకు రాయాలి ?
ఎవరికోసం రాయాలి ?



ఏదిఏమైనా రాయాలి 
రాసి తీరాలి
నిజాయితీగా చదివే వారికోసమో
నిజమైన సాహిత్యాన్ని
గెలిపించటం కోసమో మాత్రమే కాదు
నన్ను నేను గెలిపించుకోవటం కోసం
నాలోని సాహిత్యాన్ని బ్రతికించటం కోసం
ఎందుకంటే 
కవిత్వం ప్రవేశించడం తప్ప 
నిష్క్రమించలేని పద్మవ్యూహం.
సాహిత్యం సాగిపోవటం తప్ప
ఆగిపోవటం తెలియని ప్రవాహం.

       
        రచన
సతీష్ కుమార్ బొట్ల
    బొట్లవనపర్తి
   9985960614
Botlasjindagi.blogspot.in




Thursday 9 April 2020

“ఊరపిచ్చుక”


రెక్కలపై ఆకాశాన్ని మోస్తూ
కాళ్ళతో నేలను గీరుతూ
నిత్యం గాలిలో ఎగురుతూ
నింగికి నేలకు నిచ్చెనవేస్తూ
అనంత విశ్వాన్ని అలుముకునే
ఆత్మవిశ్వాసం గల అల్ప జీవి
అందమైన పిచ్చుక

సూర్యకిరణాలకంటే వేగంగా వచ్చి
చూరులో నాయన కట్టిన 
ధాన్యపు గోలుకలపై వాలి
కిల కిల రాగాలతో నిద్దురలేపి
 కొత్త సంగీతాన్ని వినిపించేవి
కట్టెపుల్లలు వరిగడ్డిని తెచ్చి
ఎండుటాకులతో కూర్చి
 ఇంటిముందు పెరిగిన జామచెట్టు  
కొసకొమ్మల్లో  అందమైన గూళ్ళు కట్టేవి
ఇసుకలో గూళ్ళు కట్టడం నేర్పేవి

పాలు పోసుకున్న మొక్కజొన్న కంకి పై
పునాస మొలక మళ్ళ పై
చేను చెల్కల్లో  మంచెల పై
వాగు వంకల్లో వంగిన చెట్లపై
చెరువు ఒడ్డు కట్టపై
చెలిమె ఒడ్డు తుంగ దాట్ల పై
ఊరంతా కనిపించేది
ఊరపిచ్చుకల సందడి

వాగులు వంకలు వట్టిపోయి
కబ్జాల కోరల్లో ఊట చెలిమెలు కూరిపోయి
కంచె చేనును మేసే క్రమంలో 
మంచె విరిగిపోయి
సూర్లు కనుమరుగై
సుందరమైన భవనాలు వెలిశాక
సూరులో పిట్టలకోసం గోలుకలు కట్టిన
చేతులు మాయమైనంక
గోడమీదైన కనీసం నాలుగు గింజలు పోసే
మానవత్వం మనుషుల్లో చచ్చిపోయాక
చెరువు ఒడ్డున చెట్లను కూలదోసి
సెల్ ఫోన్ టవర్లు వెలిశాక
ఊరంతా రేడియేషన్ రాకాసి ఉప్పెనలో చిక్కాక
ఊళ్ళో ఊరపిచ్చుకల సందడి తగ్గింది.
అయిన సందడి చేయడానికి
అవి ఉంటే కదా
మనం ఉండనిస్తే కదా.

                      రచన 
               సతీష్ కుమార్ బోట్ల 
                   9985960614
         Botlasjindagi.blogspot.in
                      

Tuesday 7 April 2020

“వలసజీవి”



ఆకలి వేటలో 
బతుకు బాటలో 
నిత్య వలసజీవై 
నిరంతర శ్రమజీవై
ఎందరో  కలలకి రంగుల రూపమిచ్చి 
ఎన్నో కళల సౌధాలనిర్మాణాల్లో 
నిన్నటివరకు రాళ్ళెత్తిన  చేతులు
నేడు నెత్తిమిద  మూటలెత్తి
పురోగమనం నుండి మళ్ళీ
తిరోగమనం వైపు తిరిగి పయనమైనాయి

శ్రమైఖ్య సౌందర్యంలో మెరిసిన దేహలిప్పుడు 
స్వేదపు వర్షంలో తడుస్తూ
మైళ్ళురాళ్ళు పాతిన బ్రతుకులు 
మైళ్ళ దూరం కాలిబాటలో నడుస్తూ 
కానరాని మానవత్వపు దారుల్లో 
కాలేకడుపుల డొక్కల్లో
కాసిన్ని అన్నం మెతుకులు విసిరే 
కరుణా మయులకోసం 
కనుచూపులని పొడుచుకొని చూసిన 
నెత్తురోడుస్తున్న పాదాల నడకనాపి 
నిలబడేందుకు నీడనిచ్చే నివాసాలకోసం 
నిరంతరం ఎదురుచూస్తు
మంచితనానికి ముళ్ళ కంచెలేసుకున్న ఊళ్ళను 
మానవత్వపు తలుపుకు గొళ్ళాలేసుకున్న ఇళ్ళను 
దాటుతూ కడపటి ఆశలను మోస్తూ కదిలిపోతున్న 
దైన్యపు బతుకులు 
గమ్యం  చేరేదెప్పుడు 
గమనం అపేదెప్పుడు 



బ్రతుకు పోరులో 
వలసజీవికి 
కాలానికొక కష్టం 
రుతువుకొక  నష్టం 
కాలేకడుపుల జీవితాలకు 
కరోనా అనే శత్రువు  ఇప్పుడు 
శత్రువుతో తలపడేందుకు 
జీవితం  చాలటం లేదు 
కన్నీళ్ళు తుడుచుకునేందుకు 
చేతులు చాలటం లేదు 
ఇప్పుడు చేయాల్సిందిక 
దిగులును ధిక్కరిస్తూ 
చీకటి దారుల్లో కాగడాలు వెలిగిస్తూ 
కదిలిపోవటమే 
ఇప్పుడు మిగిలిందిక 
ఆకలిలేని లోకానికి సాగిపోవటమే 
ఆశల తీరం చేరుకోవటమే........

                      రచన 
               సతీష్ కుమార్ బోట్ల 
                   9985960614