Thursday 9 April 2020

“ఊరపిచ్చుక”


రెక్కలపై ఆకాశాన్ని మోస్తూ
కాళ్ళతో నేలను గీరుతూ
నిత్యం గాలిలో ఎగురుతూ
నింగికి నేలకు నిచ్చెనవేస్తూ
అనంత విశ్వాన్ని అలుముకునే
ఆత్మవిశ్వాసం గల అల్ప జీవి
అందమైన పిచ్చుక

సూర్యకిరణాలకంటే వేగంగా వచ్చి
చూరులో నాయన కట్టిన 
ధాన్యపు గోలుకలపై వాలి
కిల కిల రాగాలతో నిద్దురలేపి
 కొత్త సంగీతాన్ని వినిపించేవి
కట్టెపుల్లలు వరిగడ్డిని తెచ్చి
ఎండుటాకులతో కూర్చి
 ఇంటిముందు పెరిగిన జామచెట్టు  
కొసకొమ్మల్లో  అందమైన గూళ్ళు కట్టేవి
ఇసుకలో గూళ్ళు కట్టడం నేర్పేవి

పాలు పోసుకున్న మొక్కజొన్న కంకి పై
పునాస మొలక మళ్ళ పై
చేను చెల్కల్లో  మంచెల పై
వాగు వంకల్లో వంగిన చెట్లపై
చెరువు ఒడ్డు కట్టపై
చెలిమె ఒడ్డు తుంగ దాట్ల పై
ఊరంతా కనిపించేది
ఊరపిచ్చుకల సందడి

వాగులు వంకలు వట్టిపోయి
కబ్జాల కోరల్లో ఊట చెలిమెలు కూరిపోయి
కంచె చేనును మేసే క్రమంలో 
మంచె విరిగిపోయి
సూర్లు కనుమరుగై
సుందరమైన భవనాలు వెలిశాక
సూరులో పిట్టలకోసం గోలుకలు కట్టిన
చేతులు మాయమైనంక
గోడమీదైన కనీసం నాలుగు గింజలు పోసే
మానవత్వం మనుషుల్లో చచ్చిపోయాక
చెరువు ఒడ్డున చెట్లను కూలదోసి
సెల్ ఫోన్ టవర్లు వెలిశాక
ఊరంతా రేడియేషన్ రాకాసి ఉప్పెనలో చిక్కాక
ఊళ్ళో ఊరపిచ్చుకల సందడి తగ్గింది.
అయిన సందడి చేయడానికి
అవి ఉంటే కదా
మనం ఉండనిస్తే కదా.

                      రచన 
               సతీష్ కుమార్ బోట్ల 
                   9985960614
         Botlasjindagi.blogspot.in
                      

No comments:

Post a Comment