Monday 20 April 2020

ఎందుకు రాయాలి?



రాయాలా!
ఏం రాయాలి ?
ఎందుకోసం రాయాలి ?
రాసింది చదివే ఓపికలేని
బద్దకస్తుల కోసమా?
చదివింది అర్థం చేసుకోలేని
ఆజ్ఞానుల కోసమా ?
రాయటాన్నీ చదవటాన్నీ 
ఎగతాళి చేసే మూర్ఖులకోసమా ?
విషయ జ్ఞానం లేకున్నా
వితండవాదం చేసే వింత మనుషులకోసమా ?
ఎందుకోసం రాయాలి ?



అక్షరాలు ఆయుధాల కంటే పదునైనవని
ఆయుధాలు గెలవాలేని చోట కూడా 
అక్షరాలు గెలిసి నిలుస్తాయని
అక్షరాలు ఆలోచనలకు
పదును పెడుతాయని
అక్షరాలు ఆశయం వైపు నడిపిస్తాయని
చేతులు రాసే రాతలు 
తల రాతలను మారుస్తాయని
పెన్ను పాళీనుండి రాలే అక్షరాలు
ప్రపంచ స్థితి గతులనే
తారుమారు చేస్తాయని
అక్షరాలు రాయటమంటే
ఆలూ చీప్స్ తిన్నంత  సులభం కాదని
అంతర్మధనం జరగాలని
అంతః కరణ శుద్ధిఉండాలని
తెలుసుకోలేని తెలివితక్కువ
జనాలకోసం రాయాలా?


రాతలమీద కూడా
రాజకీయాలు చేసే రచయితలు
అవతలివాడి అక్షరాలను కూడా
అవార్డుల కోసం అమ్ముకునే 
అబద్ధపు కవులు
కాసేపు స్వడబ్బా
కాసేపు పర డబ్బాతో
పరస్పర సహకారంతో
సాహిత్యం లో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న
కొద్దిమంది చేతుల్లో  సాహిత్యాన్ని బందీ చేయటానికా
ఎందుకు రాయాలి ?
ఎవరికోసం రాయాలి ?



ఏదిఏమైనా రాయాలి 
రాసి తీరాలి
నిజాయితీగా చదివే వారికోసమో
నిజమైన సాహిత్యాన్ని
గెలిపించటం కోసమో మాత్రమే కాదు
నన్ను నేను గెలిపించుకోవటం కోసం
నాలోని సాహిత్యాన్ని బ్రతికించటం కోసం
ఎందుకంటే 
కవిత్వం ప్రవేశించడం తప్ప 
నిష్క్రమించలేని పద్మవ్యూహం.
సాహిత్యం సాగిపోవటం తప్ప
ఆగిపోవటం తెలియని ప్రవాహం.

       
        రచన
సతీష్ కుమార్ బొట్ల
    బొట్లవనపర్తి
   9985960614
Botlasjindagi.blogspot.in




4 comments:

  1. కవిత్వం ప్రవేశించడం తప్ప
    నిష్క్రమించలేని పద్మవ్యూహం.
    సాహిత్యం సాగిపోవటం తప్ప
    ఆగిపోవటం తెలియని ప్రవాహం.

    👌👌👌👌👌

    ReplyDelete
  2. ధన్యవాదాలు అండి

    ReplyDelete
  3. చాలా బాగా రాశారు...
    telugu netflix

    ReplyDelete