Tuesday 31 March 2020

కర్ఫ్యూ / నిజమైన దేశభక్తి


కాలం కన్నెర్ర చేసినప్పుడు
కంటికి కనిపించని శత్రువు
కంటిపై కునుకు లేకుండా చేస్తున్నప్పుడు
కన్నీళ్లను ధారబోయటం కాదు
కవాతు సైన్యమై యుద్ధం  చేయాలి


అవునిప్పుడు
యుద్దమేఘాలు కమ్ముకున్నాయి
కంటికి కనిపించని శత్రువు పై
కనికరం లేని పోరాటనికి సిద్దమవ్వాలి
ఎదురువడితే
ఎదుటోని బలం లాక్కునే వాలిని
చెట్టుసాటునుండి రాముడు చంపినట్లు
కంటికి కనిపించని కరోనను మనం
కనిపించకుండనే ఖతం చెయ్యల్లె


యుద్దంలో ఇప్పుడు కావాల్సింది
అస్త్రవిన్యాసం కాదు
అస్త్రసన్యాసం
అవునిప్పుడు
వీధుల్లో కలిసికట్టుగా తిరగటం కాదు
వీధుల్లో కి రాకుండా
విడివిడిగా ఇంట్లో కూర్చోవటం
నీకు నువ్వే కర్ఫ్యూ విధించుకోవటం

ఏ నిన్ను నువ్వు నియంత్రిన్చుకోలేవా?
నిన్ను నువ్వు కట్టడి చేసుకోలేవా ?
ఆకాశానికి హద్దులెవ్వడు గీసాడు
సముద్రానికి ఒడ్డునేవ్వడు కట్టాడు
నీకు నువ్వు హద్దులు గీసుకోనికి
నిన్ను నువ్వు నిర్బంధించుకోనికి
ముళ్ళ కంచెలు
రాజ్యపు ఆంక్షలు కావాలా?
ఖాకి లాఠీ  కావతు చెయాల?


దేశం గెలిచినప్పుడు
జెండాలు పట్టుకొని ఉరేగటం కాదు
దేశాన్ని గెలిపించటం కోసం
చేతులు కట్టుకొని ఇంట్లో కుసోవటం కూడా దేశభక్తే
మీరు నిజమైన దేశభక్తులే అయితే
ఇప్పుడు మిమ్మల్ని మీరే నిర్బంధించుకోండి
ఇక మీకు మీరె కర్ఫ్యూ విధించుకోండి
మీ నిజమైన దేశభక్తి నిరూపించుకోండి.

                  రచన
                 సతీష్ కుమార్ బోట్ల
              బొట్లవనపర్తి
                 9985960614
                             Botlasjindagi.blogspot.com


Monday 30 March 2020

వారధి


నిశీధి నిండుకున్న ఈ నడి రాత్రి
నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ
నిశ్చలంగా కొట్టుకొనే గుండె
ఎందుకో వేగం పెంచింది
గుండెకు గుబులెందుకు పట్టుకుందో
ఒంటికి చెమటెందుకు చుట్టుకుందో
గుర్తించడానికి ఆనవాళ్ళు ఏం లేవు
ఉన్న ఆనవాళ్ళకి ఏ ఆలోచన
సరిపోవటం లేదు

చెదిరిన స్వప్నాలు
చేదు జ్ఞాపకాలు
పీడ కలలై వెంటాడితే
గుబులుని మాన్పాల్సిన గుండె
గట్టిగా కొట్టుకుంటుంటే
బాయగ్ని ధైర్యాన్ని
దవనాలంల దహించి వేస్తుంటే
మనసుకి ఎంత భారం
మనిషికి ఎంత భయం

చీకటి శక్తివంతమైనది
చూపుల చాసినంత మేర
శూన్యాన్నే విస్తరిస్తోంది
వెలుగు కిరణాలని తనలో
విలీనం చేసుకుంటుంది
ఆలోచనలకు కళ్ళెంవేసి
అలజడులను కట్టడిచేసే
అక్షరాలు అసంపూర్ణ
కావ్యాలై కాలిపోతుంటే
కూలిన చితాభస్మాన్ని
ఎరువుగా చేసి
ధైర్యపు విత్తనాలను మొలకెత్తించే
కవిత్వపు కపోతాలను ఎగిరేసి
కల్లోలాన్ని కూలద్రోసే
కలల్నిప్రోగుచేసి
ధైర్యానికి దారులేస్తున్నాను

అవును
చీకటి
భయం
అవిభక్త కవలలు
వెలుగు
ధైర్యం
సమాంతర రేఖలు
కవిత్వం మాత్రమే
ఈ రెండింటిని
కలిపే వారధి
చీకట్లోనుంచి నన్ను
వెలుగులోకి నడిపించే సారధి.

     రచన
సతీష్ కుమార్ బొట్ల
9985960614
                Botlasjindagi.blogspot.in

Saturday 28 March 2020

తండ్లాట


అదే ఆత్మ
అడుగుల ప్రవాహమై
దశాబ్దాల దూరం నడిసోచ్చక కూడ
ఆశల అన్వేషణలో
అలుపెరుగని సంఘర్షణలతో
అనునిత్యం పోరాడుతూ
బతుకు పుస్తకం పై
బాధ్యతల సంతకం చేస్తుంది


ఆలోచనలదేముంది
అన్నిదిక్కులకు ప్రాకుతుంది
ఆరాటంది ఏముంది
ఆకాశం అంచులను తాకుతుంది
ఆశలు అనంతం
అన్వేషణ నిమ్మిత్తం
అనుభవాల అడుగుజాడల్లో
ఆనవాళ్ళ వెలుగు నీడల్లో
అలసిన మనసుకి ఆశ చావదు
ఆత్మకి ఆరాటం తీరదు


ఆత్మా పిపాసి
అనుబంధాలను అలుముకుంటది
ఆస్తులు అంతస్తులకై అర్రులుచాస్తాది
బందలతో బందనలు కట్టుకుంటది  
బూటకపు కలలు కంటది
ఆశల అగ్గి రగిల్చుకుంటది
అనునిత్యం బాధ్యతల కొలిమిలో కాలుతుంటది
ఆనుభావాల సారన్న౦త అవిరిచేసి
జీవిత సత్యాన్ని మరిచి
మరణమే చివరి మజిలి అని తెలిసిన
ముగింపు లేని గమ్యాన్ని వెతుకుతుంటుంది


సముద్రంలో కలిస్తేనే
నది ప్రయాణం ముగిసినట్లు
సాయంత్రమైతేనే
సూర్యుడి గమనం ఆగినట్లు
మరణం మనిషిని హత్తుకుంటేనే
ఆత్మ తపన ఆగుతుంది
బతుకు తండ్లాట ముగుస్తుంది.
                                             
రచన
                                 సతీష్ కుమార్ బోట్ల
                                         9985960614
                                              botlasjindagi.blogspot.in