Saturday 28 March 2020

తండ్లాట


అదే ఆత్మ
అడుగుల ప్రవాహమై
దశాబ్దాల దూరం నడిసోచ్చక కూడ
ఆశల అన్వేషణలో
అలుపెరుగని సంఘర్షణలతో
అనునిత్యం పోరాడుతూ
బతుకు పుస్తకం పై
బాధ్యతల సంతకం చేస్తుంది


ఆలోచనలదేముంది
అన్నిదిక్కులకు ప్రాకుతుంది
ఆరాటంది ఏముంది
ఆకాశం అంచులను తాకుతుంది
ఆశలు అనంతం
అన్వేషణ నిమ్మిత్తం
అనుభవాల అడుగుజాడల్లో
ఆనవాళ్ళ వెలుగు నీడల్లో
అలసిన మనసుకి ఆశ చావదు
ఆత్మకి ఆరాటం తీరదు


ఆత్మా పిపాసి
అనుబంధాలను అలుముకుంటది
ఆస్తులు అంతస్తులకై అర్రులుచాస్తాది
బందలతో బందనలు కట్టుకుంటది  
బూటకపు కలలు కంటది
ఆశల అగ్గి రగిల్చుకుంటది
అనునిత్యం బాధ్యతల కొలిమిలో కాలుతుంటది
ఆనుభావాల సారన్న౦త అవిరిచేసి
జీవిత సత్యాన్ని మరిచి
మరణమే చివరి మజిలి అని తెలిసిన
ముగింపు లేని గమ్యాన్ని వెతుకుతుంటుంది


సముద్రంలో కలిస్తేనే
నది ప్రయాణం ముగిసినట్లు
సాయంత్రమైతేనే
సూర్యుడి గమనం ఆగినట్లు
మరణం మనిషిని హత్తుకుంటేనే
ఆత్మ తపన ఆగుతుంది
బతుకు తండ్లాట ముగుస్తుంది.
                                             
రచన
                                 సతీష్ కుమార్ బోట్ల
                                         9985960614
                                              botlasjindagi.blogspot.in 

No comments:

Post a Comment