Monday 30 March 2020

వారధి


నిశీధి నిండుకున్న ఈ నడి రాత్రి
నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ
నిశ్చలంగా కొట్టుకొనే గుండె
ఎందుకో వేగం పెంచింది
గుండెకు గుబులెందుకు పట్టుకుందో
ఒంటికి చెమటెందుకు చుట్టుకుందో
గుర్తించడానికి ఆనవాళ్ళు ఏం లేవు
ఉన్న ఆనవాళ్ళకి ఏ ఆలోచన
సరిపోవటం లేదు

చెదిరిన స్వప్నాలు
చేదు జ్ఞాపకాలు
పీడ కలలై వెంటాడితే
గుబులుని మాన్పాల్సిన గుండె
గట్టిగా కొట్టుకుంటుంటే
బాయగ్ని ధైర్యాన్ని
దవనాలంల దహించి వేస్తుంటే
మనసుకి ఎంత భారం
మనిషికి ఎంత భయం

చీకటి శక్తివంతమైనది
చూపుల చాసినంత మేర
శూన్యాన్నే విస్తరిస్తోంది
వెలుగు కిరణాలని తనలో
విలీనం చేసుకుంటుంది
ఆలోచనలకు కళ్ళెంవేసి
అలజడులను కట్టడిచేసే
అక్షరాలు అసంపూర్ణ
కావ్యాలై కాలిపోతుంటే
కూలిన చితాభస్మాన్ని
ఎరువుగా చేసి
ధైర్యపు విత్తనాలను మొలకెత్తించే
కవిత్వపు కపోతాలను ఎగిరేసి
కల్లోలాన్ని కూలద్రోసే
కలల్నిప్రోగుచేసి
ధైర్యానికి దారులేస్తున్నాను

అవును
చీకటి
భయం
అవిభక్త కవలలు
వెలుగు
ధైర్యం
సమాంతర రేఖలు
కవిత్వం మాత్రమే
ఈ రెండింటిని
కలిపే వారధి
చీకట్లోనుంచి నన్ను
వెలుగులోకి నడిపించే సారధి.

     రచన
సతీష్ కుమార్ బొట్ల
9985960614
                Botlasjindagi.blogspot.in

No comments:

Post a Comment