Saturday 15 May 2021

ఏమో ? / చివరి నిమిషం వరకు

 

కాలం పేల్చిన ఫిరంగులకి

కలల సౌధం కూలిపోతుంటే

కనుపాప చూసిన రేపటి స్వప్నం

కనురెప్పల మాటు కన్నీటిలోనే కరిగిపోతుంటే

నిర్లిప్తం చేసిన నిర్దాక్ష్యపు దాడికి

నిన్నటి చిరునవ్వులు చితికిపోతుంటే

కలగన్న ప్రయాణంలో

కనిపించని మలుపులెన్నో

నిత్యం నడవాల్సిన దారిలో

నిన్ను పడదోసే కుదుపులెన్నో

నిశి పరుచుకున్న జీవితంలో

శశి కూడా వెలిగించలేని కాళరాత్రులెన్నో

 

ఏమో ఏ ప్రయాణం

ఎప్పుడు ముగుస్తుందో

ఏమో ఏ మలుపు

గెలుపు తలుపు తడుతుందో

ఏ మిణుగురు

చీకటిని వెలిగిస్తుందో

ఏ రవి కిరణం

రాతిరిని కరిగిస్తుందో

ఏ ఓటమి

ఎప్పుడు అస్తమిస్తుందో

ఏ గెలుపు

ఎప్పుడు ఉదయిస్తుందో

 

ప్రాణం  నిలిచిన చివరి నిమిషం వరకు

పాదాల ప్రయాణం సాగాల్సిందే

నయనం వెలుగును చూసేవరకు

నిరంతరం కనురెప్పలు తెరిచి ఉంచాల్సిందే..

నిన్ను నువ్వు జయించేంతవరకు

నిత్యం జీవితం తో పోరాటం చేయాల్సిందే.

 

                                      రచన

                        సతీష్ కుమార్ బొట్ల

           కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం.

                                9985960614

                                           Botlasjindaji.blogspot.in


Friday 5 March 2021

"మోదుగుపూల వనం"

 

గడీల పాలనలో

గడియ బ్రతకు గగనమైనప్పుడు

బలసిన దొరల పెత్తనంలో

బక్కోడి బ్రతుకు ఛిద్రమైనప్పుడు

పాలేగాళ్ల పంచన

పాలేరుగిరే శరణమైనప్పుడు

అణచివేతలు అధికమైనప్పుడు

అడుగడుగునా అవమానాలు ఎదురైనప్పుడు

అణచివేయబడ్డ జీవితాలు

కార్చిన కన్నీళ్లకు పూసిన మోదుగుపూలు

బలహీనుడి భుజాన

బలమైన వేలాడిన బందూకలు.

జనరాణ్యం లోని మృగాలను తరిమేందుకు

వనరాణ్యంలో శక్తిని నింపుకున్న విప్లవ కేకలు.

 

 

బురుజు కోట గోడలు

బద్ధలుకొట్టిన డైనమేట్ మోత

భూస్వామ్య వ్యవస్థ గుండెల్లో

గుబులు పుట్టించిన

లాల్ సలాం కూత.

ప్రజాస్వామ్యంలో న్యాయం

పాలకుల పంచన చేరినప్పుడు

ప్రజా దర్బార్లో న్యాయాన్ని

ప్రజల చెంతకు చేర్చిన చీకటి సైన్యం.

అంతర్గత పోరులో మునిగినప్పుడు

ఆత్మశుద్ధి లేని బలగాలపై

సుధీర్ఘ శిశిరం చేసిన దాడికి

ఆశయాలు రాల్చి మోడువారిన వనమైంది.

 

 

రూపం మార్చిన సమస్యను చేరబట్టేందుకు

రాజకీయ ముసుగులో

రక్తపాతాన్ని రూపుమాపేందుకు

దౌర్జన్యం దవానలమై వ్యాపించినప్పుడు

దగాపడ్డ బతుకుల ఆశలు రాలిపడినప్పుడు

పచ్చని అడవిలో మళ్ళీపూసే

ఎర్రని మోదుగుపూల వనం

సామ్రాజ్యవాద దొర పాలనపై

పేలనున్న విప్లవ కణం.

 

  రచన

                                సతీష్ కుమార్ బొట్ల

                 కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం.

                               Cell: 9985960614.

                                       Botlasjindagi.blogspot.in