Tuesday 7 April 2020

“వలసజీవి”



ఆకలి వేటలో 
బతుకు బాటలో 
నిత్య వలసజీవై 
నిరంతర శ్రమజీవై
ఎందరో  కలలకి రంగుల రూపమిచ్చి 
ఎన్నో కళల సౌధాలనిర్మాణాల్లో 
నిన్నటివరకు రాళ్ళెత్తిన  చేతులు
నేడు నెత్తిమిద  మూటలెత్తి
పురోగమనం నుండి మళ్ళీ
తిరోగమనం వైపు తిరిగి పయనమైనాయి

శ్రమైఖ్య సౌందర్యంలో మెరిసిన దేహలిప్పుడు 
స్వేదపు వర్షంలో తడుస్తూ
మైళ్ళురాళ్ళు పాతిన బ్రతుకులు 
మైళ్ళ దూరం కాలిబాటలో నడుస్తూ 
కానరాని మానవత్వపు దారుల్లో 
కాలేకడుపుల డొక్కల్లో
కాసిన్ని అన్నం మెతుకులు విసిరే 
కరుణా మయులకోసం 
కనుచూపులని పొడుచుకొని చూసిన 
నెత్తురోడుస్తున్న పాదాల నడకనాపి 
నిలబడేందుకు నీడనిచ్చే నివాసాలకోసం 
నిరంతరం ఎదురుచూస్తు
మంచితనానికి ముళ్ళ కంచెలేసుకున్న ఊళ్ళను 
మానవత్వపు తలుపుకు గొళ్ళాలేసుకున్న ఇళ్ళను 
దాటుతూ కడపటి ఆశలను మోస్తూ కదిలిపోతున్న 
దైన్యపు బతుకులు 
గమ్యం  చేరేదెప్పుడు 
గమనం అపేదెప్పుడు 



బ్రతుకు పోరులో 
వలసజీవికి 
కాలానికొక కష్టం 
రుతువుకొక  నష్టం 
కాలేకడుపుల జీవితాలకు 
కరోనా అనే శత్రువు  ఇప్పుడు 
శత్రువుతో తలపడేందుకు 
జీవితం  చాలటం లేదు 
కన్నీళ్ళు తుడుచుకునేందుకు 
చేతులు చాలటం లేదు 
ఇప్పుడు చేయాల్సిందిక 
దిగులును ధిక్కరిస్తూ 
చీకటి దారుల్లో కాగడాలు వెలిగిస్తూ 
కదిలిపోవటమే 
ఇప్పుడు మిగిలిందిక 
ఆకలిలేని లోకానికి సాగిపోవటమే 
ఆశల తీరం చేరుకోవటమే........

                      రచన 
               సతీష్ కుమార్ బోట్ల 
                   9985960614

1 comment: