Monday 12 October 2020

జీవన మజిలీ


 

మాటలు గుండెల్లో

పూడుకుపోయినప్పుడు

మౌనం మనస్సుతో

మాటలాడినప్పుడు

ప్రపంచానికి తెలియని

పలవరింతలెన్నో

కనులువీడి కదలని

కలత నిద్రలెన్నో

 

 

వెలుతురు అస్తమించిన ప్రయాణంలో

వెలిగించిన కాగడాను చీకటి మింగేసినట్లు

సముద్రంనుడి పైకెగిసిన అలను

అదే సముద్రం లాగేసుకున్నట్లు

కనే కలల్ని కన్నీళ్లే తుడ్చేస్తుంటే

కదిలే పాదాల్ని

కాలమే కట్టిపడేస్తుం(ది)టే

గతమంత గారుడుకట్టిన గాయమై

భవిష్యత్తు బహుళ ప్రశ్నార్ధకమై

గుండెను సలుపుతున్న గాయాలను

గమనమంత గతుకుల మాయమైన దారులను

దాటుతూ సాగుతున్న ప్రయాణంలో

దారంత పరుచుకున్న ముల్లెన్నో

వాటిని ఏరేలోపే

ముగింపులేని

మూల మలుపులెన్నో

వాటిని దాటేలోపే

అడుగు కదపనివ్వని

అవరోధాలెన్నో

 

 

ఏ మలుపు నన్నుఎటువైపు తిప్పిన

ఏ ఓటమి నన్ను వెంటాడిన

ఏ గెలుపు నన్ను ఊరించిన

గెలుపు ఓటములు లేని

గమ్యన్నీ చేరెవరకు

మొదలు ముగింపు లేని

గమనాన్ని తాకే వరకు

చీకటి వెలుగులను దాటుకుంటూ ....

కలలను కన్నీళ్ళని ఈదుకుంటూ

సాగిపోతూనే ఉంటుంది

నా జీవన మజిలీ.

 

     

      రచన

సతీష్ కుమార్ బొట్ల

9985960614

Botlasjindagi.blogspot.in

No comments:

Post a Comment