Monday 14 September 2020

భయం

 

నిశ్శబ్దం నిశీధిని పెనవేసుకున్నప్పుడు

భయం వేర్లు పాతుకుంటున్నప్పుడు

బాధ కొత్తగా చిగురు తొడుగుతుంటుంటే

గుండెల్లో తెలియని గుబులు పురుడు పోసుకుంటుంది

 


ఇన్నాళ్లుగా లేని భయం

ఇప్పటివరకు తెలియని కొత్త భయం

ఇప్పుడెందుకు మొగ్గ తొడుగుతుంది

ఇదేందుకో నాకు వింతగా తోస్తుంది

మంచును మంట కరిగించినట్లు

మంటను నీరు ఆర్పేసినట్లు

వసంతంలో చిగురించిన ఆకుల్ని

శిశిరం రాల్చినట్లు

ధైర్యం వెలిగించిన దీపాన్ని

భయం ఆర్పేస్తుంది

మస్తిష్కం లోని భీకర ఆలోచనలు

హృదయపు స్పందనల ఉప్పెనలు

లోపలి ఆందోళన సరస్సులు

బయట భయపు సంద్రాన్ని సృష్టిస్తున్నాయి

 


భయం నిస్త్రాణం కాదు

నిమురు గప్పిన నిప్పు

భయం నగ్న శిఖరం కాదు

మౌనం మలచిన భీకర శిల్పం

భయం జనారణ్యంలోని దృశ్యం కాదు

మౌనారణ్యం లోని క్రూరమృగం

భయం బాహ్య ప్రపంచంలో పాడే

బహుజన గేయం కాదు

మనస్సులోతుల్లోకి చొచ్చుకు పోయాక

మనిషినెప్పటికి విడువనివిషాద గీతం

మనలోనే పుట్టి మనల్ని చంపే ఆయుధం.

 

                       రచన

               సతీష్ కుమార్ బొట్ల

 కరీంనగర్ జిల్లా యువరచయితల సంఘం

                   9985960614

1 comment: