Monday 7 September 2020

కలగన్న కవిత్వం

 

తిరిగి తిరిగి అలసిన మసస్సుకి

తిమిరం తాకగానే

తీరని వేదనంత దుఃఖమైన

తెరిపిలేని కవిత్వాన్ని కలగన్నాను

నిజంలో నిద్రపోయిన కన్నీటి ధారల్ని

నిద్రలో కవిత్వపు జల్లులుగా జాలువార్చాను

 

 

కవిత్వాక్షరాలన్నీ

కలల్లోంచి బయటపడకుండానే

నా మౌనం దాచేసిన నిన్నటి మాటల్ని

నా పాదాలు నడవని రేపటి బాటల్ని

అమాంతం ఆలింగనం చేసుకొని

నిన్నటి రాతిరి రాల్చిన కొన్ని నక్షత్రాలని

రేపు ఉదయించబోయే వెలుగు కిరణాల్ని

తన కవిత్వంలో అక్షరాలుగా పొదుముకున్నాయి

 

 

కలలో కురుస్తున్న కన్నీటి వానలో

నా దేహం తడిచి ముద్దవుతుంటే

వెన్నెల రాత్రి వెలేసిన నగ్న మానుల్ని

వేదన నిండిన విషాద గీతాల్ని

నా కవిత్వం గానం చేస్తుంటే

ఇంతకంటే దుఃఖపు ప్రవాహపువెంట

నేను ప్రయాణిస్తున్నప్పుడు

నా పాదాలకింద నలిగిపోతున్న

అక్షరాల వరుసొక్కటి

పదమై నన్ను పలకరిస్తుంది.

నేను రాల్చుకున్న

కన్నీటి ధారల్ని ఏరితెచ్చి

నా కవిత్వంలో పంక్తులుగా నింపుతుంది

 

 

కల కలాన్ని కదిపిన ప్రతిసారి

కవిత ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది.

ఈ ప్రవాహంలో

అక్షరాలు నా కవిత్వాన్ని ప్రేమించటం

కవిత్వం అక్షరాలని ఆరాధించటం ఎంతనిజమో

కవిత్వాక్షరాల ప్రేమలో నేను నిండా మునగటం

అప్పుడప్పుడు ఈ సమాజాన్ని ప్రేమలో ముంచటం అంతే నిజం

 

 

నిరంతరపు నిన్నటి రాత్రి నిద్ర

నన్ను కలల్లో ముంచుతూనే ఉంది

గడ్డకట్టి కరిగిపోని రాతిరి

నాలోని పూడుకుపోయిన

అక్షరాలని తవ్వుతూనేఉంటే

నేనేమో నిన్నటి

కలల దుప్పటిని దులిపేసి

కలగన్న కవిత్వాన్ని అక్షరీకరించి

ముఖం పై చిరునవ్వు ముసుగేసుకొని

ఈ రోజులో పడ్డాను.

 

 

             రచన

     సతీష్ కుమార్ బొట్ల

కరీంనగర్ జిల్లా యువ రచయితలసంఘం

        9985960614

 

2 comments:

  1. Each and every writing from is having great information and eye opening bro

    ReplyDelete