Friday 4 August 2017

వాడు –నేను


ఆలోచనలతో అలసి
ఒంటరితనంతో నెరసి
స్తబ్ధంగా, నిశబ్దంగా నేనున్నప్పుడు 
మాటల ప్రవాహమై వాడొస్తాడు
నాలోని అలజడులను తడిమి చూస్తాడు
నా చుట్టుఉన్న నిశబ్దాన్ని చేదించే ప్రయత్నం చేస్తాడు
మాటల్ని మౌనం జయిన్చాకా
మాట్లాడుకోవటానికి ఏముంటుందని 
వాడి మాటల్ని నేను మౌనం చేస్తే 
నా మౌనాన్ని వాడు మననం చేస్తాడు

మౌనం తో సంబాషించగాలిగే మాముందు నిలువాలేక
మౌనం వేరే ప్రపంచంలోకి పారిపోతుంది
మరో ప్రపంచం మా ముందుకు చేరిపోతుంది
ఈ ప్రపంచాన్ని పరిశిలించటం వాడి ఇజం
వాడి పరిశీలనను విశ్లేషించటం నా నైజం
వాడి ఇజం , నా నైజం నుండి పురుడుపోసుకున్న నిజం
నిమురును తోలిగించుకున్న నిప్పు కణలై
నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపే అక్షర కిరణలై
మా నుండి ఈ ప్రపంచం లోకి దుసుకోస్తాయి
మమ్మల్ని ఈ ప్రపంచం నుండి మళ్ళి మాలోకి లక్కోస్తాయి
అప్పుడు
అక్షరాలని కిరణాలుగా వెలిగించిన అలిశెట్టి గురించో
ఆశలకి నిప్పులతో ఊపిరి పోసిన శ్రీ శ్రీ గురించో
జీవితాన్ని శోదించిన జిడ్డు కృష్ణముర్తి గురించో
జీవిత సత్యాన్ని బోదించే భగవద్గీత గురించో
గుండే లోతుల్లోని భావాలను గుమ్మరించి
గుడ్డిడైపోతున్న సమాజం గురించి చింతించి
నిట్టుర్పు నిజాలను తవ్వుతూ
నిర్జీవమైన సమాజానికి ప్రాణాలు పోయాలని తపన పడుతూ
తవ్విన నిజాలను కుప్పలుగా పోసి
తలోదిక్కు బేరీజు వేసుకుంటాము

కాసేపు మౌనం తరువాత
కనులు చూపిన కలల శోధన గురించో
కలత రేపిన అంతర్మదనపు ఆలోచనల గురించో
భారమవుతున్న మధ్యతరగతి బ్రతుకుల గురించో
భాధ్యతవుతున్న బంధాల గురించో
శిధిలమవుతున్న ఆశల గురించో
శిశిరం ఒక్కొకటి గా రాలుస్తున్న ఆకుల్లా
ఆలోచనల్ని జాడించి తెలికవుతున్న తరువుల్లా
మాలోని నిరాశాల్ని నిశీదిలో నిక్షేపితం చేసి
మరో వసంతం కై కలగంటుంటే
అందనంత వేగంతో కాలం పరిగెత్తుతుంటే
ఆ కాలం తోపాటు నిరంతరం మా పయనం సాగుతుంటే
నేను వాడి జీవితంలోకి వెళ్ళానో
వాడె నా జీవితం లోకి వచ్చాడో కానీ
ఈ పుష్కర కాల ప్రయాణం లో మేం నేర్చుకుంది మాత్రం
కలల్ని కనటం
కన్నిళ్ళని కౌగిలించుకోవటం
బాధల్ని భరించటం
బంధాల్ని ప్రేమించటం
సమాజహితం కాంక్షి౦ చాటం
సాహిత్యం లో జీవించటం.
(వాడు వాడిగా కనిపిస్తూ నన్ను నన్నుగా చూడగలిగే నా ఆత్మీయ మిత్రుడు ముద్దసాని శ్రీనివాస్ గురించి )
                                     రచన
                     సతీష్ కుమార్ బొట్ల
                                   9985960614
                          Botlasjindagi.blogspot.in


No comments:

Post a Comment